రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ ప్రాంతాన్ని ఇప్పటికే ముస్తాబు చేశారు. ఇవాళ ఉదయం 7.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సైనికుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొననున్నారు.
మరోవైపు నేడు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ఇవాళ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. మరోవైపు రాజ్‌భవన్ పరిసరాల్లో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వివరించారు. నగర వాసులంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు.