పీఆర్సీ పెంపు వస్తోన్న ఊహాగానాలపై తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. పీఆర్సీ పెంపుపై ఉద్యోగులు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు. సంస్థ ఇప్పటికే అధిక వేతనాలు చెల్లిస్తోందని చెప్పారు. ఉద్యోగులు అంకితభావం, నీతి నిజాయతీతో పనిచేసి సంస్థను ప్రగతిపథంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.
NPDCLకు చెందిన అన్మేన్డ్ వర్కర్స్ ప్రమాదరీత్యా మృతి చెందినా, వైకల్యం కలిగినా సంస్థ పరంగా ఆదుకునేందుకు చర్యలు చేపడతామని ప్రభాకరరావు హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్ర పవర్ కోఆర్డినేషన్ కమిటీలో చర్చించి వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు.
గురువారం హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో.. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 13వ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తొలుత అసోసియేషన్ నూతన కాలమానిని, డైరీని ఆవిష్కరించారు. అనంతరం పీఆర్సీ పెంపుపై మాట్లాడారు. ఉద్యోగులకు ఇప్పటికే అధిక వేతనాలు చెల్లిస్తున్నామని.. పీఆర్సీ పెంపుపై ఆశ పెంచుకోవద్దని ప్రభాకర్ రావు చెప్పారు.