ఈటల నియోజకవర్గంపై మంత్రి గంగుల ఫోకస్

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ వేటు వేసిన విషయం తెల్సిందే. దీంతో ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గాక టీఆర్ఎస్ పార్టీకి, అలానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. దీంతో ఈటల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో త్వరలో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని తన క్యాడర్ చేజారిపోకుండా టీఆర్ఎస్ ఇప్పటినుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. టీఆర్ఎస్ కార్యకర్తలను సమన్వయం చేస్తూ హుజురాబాద్‌లో తన ప్రభంజనాన్ని అలానే కొనసాగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది.


ఇందులో భాగంగా సోమవారం మంత్రి గంగుల కమలాకర్ క‌రీంన‌గ‌ర్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో హుజురాబాద్ ప్ర‌జా ప్ర‌తినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తిరుగులేని శ‌క్తిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. అధికారం చేప‌ట్టి ఏడేళ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్క‌డా లేద‌ని, ప్ర‌జ‌ల్లో కేసీఆర్ గారి మీద విశ్వాసం పెరుగుతోందని అన్నారు. అటు ఎం కేసీఆర్ ప‌ని తీరుకు, ఇటు ప్ర‌భుత్వ ప‌నితీరుకు రెఫరెండంగా వ‌రుస ఎన్నిక‌ల విజ‌యాలే తార్కాణ‌మని అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ బలంగా ఉందన్న గంగుల, వ్య‌క్తులు పోయినంత మాత్రాన టీఆర్ఎస్ కు ఎలాంటి న‌ష్టం లేదని ఈటలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఎన్నిక‌లేవైనా కేసీఆర్ ఫోటోనే తమ గెలుపుమంత్రం అని అన్నారు. క‌రీంన‌గ‌ర్ లో తాను గెలిచినా, హుజురాబాద్‌లో ఈటల గెలిచినా అది కేవ‌లం కేసీఆర్ వ‌ల్లే సాధ్యమన్నారు. వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని పార్టే ముఖ్య‌మని అన్నారు. హుజురాబాద్‌లో ఈటల వ‌ల్ల ఎలాంటి న‌ష్టం లేదని, పార్టీ క్యాడర్లో ఎవ‌రికీ అనుమానాలు లేవని, అంద‌రూ పూర్తిగా ధీమాతో ఉన్నారని స్పష్టం చేసారు. పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉందని, ఎవ‌రికీ ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదన్నారు. హుజురాబాద్‌లో పార్టీ క్యాడర్ కు అండ‌గా ఉంటామని, వారికి నిరంతంర అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈటల వ్య‌వ‌హారంలో పార్టీ త్వ‌ర‌లోనే అంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటుందన్న గంగుల, పుట్ట మ‌ధు వ్వ‌వ‌హారంలో ప్ర‌భుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.