విశాఖకు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు

తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రవేశపెట్టిన కార్గో సేవలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో టీఎస్ఆర్టీసీ(TSRTC) తన కార్గో, పార్శిల్ సేవలను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కార్గో సేవలను విస్తరించింది. గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విశాఖకు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ సర్వీసులు హైదరాబాద్ నుంచి  బయలుదేరి కార్గో కనెక్టెడ్ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకోనున్నాయి.

10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్ చెరువు, మెహిదీపట్నం, లకిడికాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉన్నాయి. అలానే ఏపీ నుంచి కూడా వినియోగదారులు కార్గో సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉండగా… టారిఫ్ రేట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ఇల్లు మారుస్తున్నప్పుడు, గృహ నిర్మాణం, పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు, పర్నీచర్‌తో పాటు ఇతరత్రా వస్తు సామాగ్రీలను తరలించేందుకు ఈ ప్రత్యేక కార్గో సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. దూరం, వస్తు పరిమాణం బట్టి నిర్దిష్టంగా ఒకే రకమైన ధరలు నిర్ణయించామని, సరుకులను అత్యంత వేగంగా చేరవేసేందుకు గానూ ఈ సేవలు వినియోగదారులకు ఎంతో ఉపకరిస్తాయన్నారు.