టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత ఉత్తమమైన సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న టీఎస్ ఆర్టీసీ.. ఎంఎంటీఎస్, మెట్రో రైలు అందుబాటులో లేని ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, మియాపూర్ డిపోల పరిధిలో ఈ బస్సులను నడిపేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ – పంజాగుట్ట – జూబ్లీహిల్స్ చెక్ పోస్టు – ఫిల్మ్ నగర్ – ఉస్మానియా కాలనీల మీదుగా మణికొండ వరకు నడపాలని నిర్ణయించారు. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్‌బీ నగర్, ఇబ్రహీంపట్నం వరకు నడపాలని నిర్ణయించారు.
మియాపూర్ డిపో పరిధిలో బాచుపల్లి – జేఎన్‌టీయూ – కేపీహెచ్‌బీ – హైటెక్ సిటీ – బయోడైవర్సిటీ – గచ్చిబౌలి – వేవ్ రాక్ – ప్రగతి నగర్ – జేఎన్‌టీయూ, వీబీఐటీ వరకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులన్నింటికి ట్రాకింగ్ సిస్టమ్‌ను అమర్చుస్తామని తెలిపారు. ప్రతి 30 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండే విధంగా బస్సులను నడపనున్నారు.
ఇదిలా ఉంటే.. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు వెయ్యి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ రూట్లలో ఈ బస్సులు తిరుగుతాయని వివరించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 29, 30, 31 తేదీలలో ప్రతీరోజూ వెయ్యి బస్సుల చొప్పున వివిధ రూట్లలో నడపనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.