హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో పాదచారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర సర్కార్ నగరంలో పలుచోట్ల స్కైవాక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉప్పల్ చౌరస్తాలో నిర్మించిన స్కైవాక్‌ను ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం.. చౌరస్తా పెద్దదిగా ఉండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
660 మీటర్ల మేర ఏర్పాటుచేస్తున్న ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం కోసం హెచ్ఎండీఏ రూ.25 కోట్లు ఖర్చుచేసింది. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతోపాటు మెట్రోస్టేషన్‌తో ఆ వంతెనని అనుసంధానించారు. నాలుగు వైపులనుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు.మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, గర్భిణులు.. స్కైవాక్‌కి చేరుకునేందుకు అత్యాధునిక ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి సౌకర్యాలు కల్పించారు. స్కైవాక్ మొత్తంపొడవు 640 మీటర్లు, వెడల్పు 3-4 మీటర్లు కాగా 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేశారు.