2024 పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుందని అన్నారు సీఎం కేసీఆర్. హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికలలో రాబోయేది మన ప్రభుత్వమేనని.. దేశంలో ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో గొప్ప స్పందన వస్తుందన్నారు కేసీఆర్. అంబేద్కర్ కలలు సహకారం చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఈ సంవత్సరం లక్షాపాతికవేల మందికి దళిత బంధు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ఆకాశాన్నంటేలా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని.. దీంతో తన జన్మ ధన్యమైందని అన్నారు కేసీఆర్. భారతదేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి అంబేద్కర్ సూచనలు పనిచేస్తాయన్నారు. రాజ్యాంగం ప్రారంభమై 70 ఏళ్లు గడిచిన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పేదలు ఎవరంటే దళితులే అన్నది కఠోర వాస్తవం అని పేర్కొన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు కెసిఆర్. దేశంలో ప్రజలు గెలిచేటువంటి రాజకీయం రావాలని సూచించారు.