బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రాణహాని ఉందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తనకి నచ్చనివారిపై ఏ విధంగా కక్ష తీర్చుకుంటారన్నదానికి ఎమ్మెల్యే రాజాసింగ్ గారి అరెస్ట్ వ్యవహారమే ఒక ఉదాహరణ అన్నారు. దాదాపు నెల్లాళ్లుగా చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజాసింగ్ గారికి ప్రాణహాని ఉందని, ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఆయన సతీమణి హైకోర్టు గుమ్మం తొక్కే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్దయగా… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోందని వెల్లడించారు.
రాజాసింగ్ జైల్లోనే ఉన్నప్పటికీ.. ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేనే అని ప్రభుత్వం గుర్తించకపోవడం టీఆరెస్ ప్రభుత్వ కర్కశ నైజానికి నిదర్శనం. జైల్లో ఆయన్ని కలిసేందుకు నియోజక ఓటర్లు, పౌరుల ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదు. రాజాసింగ్ గారి విడుదల కోసం ఇక్కడివారేగాక మహారాష్ట్రలో సైతం ప్రజలు ర్యాలీలు తీస్తున్నరు. అంత ప్రజాదరణ కలిగిన ప్రజా ప్రతినిధి రాజాసింగ్ గారిని కలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును గుర్తించని పాలకులకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేనే లేదన్నారు విజయశాంతి.