వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) తరహాలో ‘వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’ పేరిట నిర్మించనుంది. రూ.175 కోట్ల తో దీనిని మడికొండ ఐటీ పార్కులో పది ఎకరాల్లో నిర్మించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీనిని చేపట్టేందుకు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) తాజాగా టెండర్లు పిలిచింది.
అంతర్జాతీయ స్థాయి సమావేశ మందిరాన్ని 50వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. దానికి అనుబంధంగా మరో 30 వేల చదరపు అడుగుల్లో ప్రదర్శనశాల, సమావేశ మందిరాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటవుతాయి. 3 స్టార్ హోటల్, వినోద కేంద్రం, బాల్‌రూమ్, సర్వీస్ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. టెండర్ ఖరారయ్యాక పనులు చేపడతారు.