RTC లో ఉచిత ప్రయాణం వెనుక ఉన్న లాభం ఏంటి..!

-

ఇటీవల ఓ టీ కొట్టు దగ్గర కొంతమంది మిత్రులు ఆడవాళ్లకు బస్సులో ఉచిత ప్రయాణం గురించి ఇలా మాట్లాడారు. అందులో సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చించారు. మంచిదే, కేవలం సమస్యల గురించే కాకుండా పరిష్కారాల గురించి వాటి సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చించడం సంతోషంగా అనిపించింది.కాంగ్రెస్ ప్రభుత్వం కంటే సామాన్యులు ఈ స్కీం గురించి మాట్లాడుతున్నారంటే , అందులోని లోటుపాట్లపై ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారంటే క్షేత్రస్థాయిలోకి ఈ పథకం ఏ స్థాయిలో చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇది మంచి మార్పు. అయితే ఇక్కడో చిన్న విషయం అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే ఈ వ్యాసం….

ఆడవాళ్లు అడిగారా, ఎందుకిది అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రశ్న మంచిదే.అన్నీ అడగక్కర్లేదు.అలాగని ఆడిగి వడ్డించాల్సిన అవసరమూ లేదు.అవసరాల గుర్తింపు నేరుగా గుర్తించే అవకాశం ఎప్పుడూ రాదు. ఎవరు ఎన్ని మాట్లాడినా..,ఇది అవసరమైన పథకం. ఎందుకంటే ఇది ఆడవాళ్ల మొబిలిటీని పెంచుతుంది. మొబిలిటీ అనేది చైతన్యానికి స్వేచ్ఛకు ఒక మెట్టు లాంటిది. ఎక్స్ పోజర్ పెరగడానికి ఒక సోపానం కూడా.

ఇంకా చెప్పాలంటే ఫ్రీ ట్రావెల్ అనేది ఇన్ సెంటివ్ లాంటిదే. అది తెలీకుండానే మొబిలిటీనిC పెంచుతుంది. వంట గదుల నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడడానికి ఒక ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది. కాళ్లకు చక్రాలు తొడుగుతుంది. దృష్టిని విశాలం చేస్తుంది. స్వేఛ్చకు కిటికీ తెరుస్తుంది. దీర్ఘకాలికంగా చూస్తే చైతన్యపు ద్వారాలు తెరుస్తుంది. ఇదేదీ వన్ టు వన్ కాదు. నేరుగా కనిపించకపోవచ్చు. కానీ మొబిలిటీకీ ఆ పవర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.మనం ఎటూ వెళ్లకుండా మన ఊర్లోనే నిలిచిపోయి ఉంటే ఎలా ఉండేవాల్లమో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి.

నేరుగానే చూస్తే దినసరి కూలీలు, రోజువారీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి ఇది చాలా ఉపశమనం. ఆ వచ్చే బోడి డబ్బుల కోసం రోజూ ఎందుకింత గోస, మానేయ్యరాదూ అనే ఇంట్లో వాళ్ళ మాటకు జవాబు దొరికినట్టే. ఇంట్లోంచి బయటపడడానికున్న ఒక అడ్డంకిని దాటడానికి ఒక సాధనం అవుతుంది. కొత్తగా ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చే బీదా సాదా బిడ్డలకు ఒక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆధునిక జీవనంలో ట్రావెలింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న అంశం. కొన్ని ప్రదేశాల్లో ఇది తిండిని మించిన ఖర్చు కూడా. రోడ్డుమీద, పబ్లిక్ స్పేసెస్లో మహిళల సంఖ్య పెరగడం అవసరం. ఆ అవసరానికి ఇది ఇలాంటి ఉచిత ప్రయాణం అనే పథకం దన్నుగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నిజమే, భారమే, బహుశా ఏడాదికి 2500 కోట్ల భారమని ఏదో లెక్క చెప్పారు సీఎం రేవంత్.కానీ మిగిలిన వాటితో పోలిస్తే దీని ప్రభావం దీర్ఘకాలికమైనది. చేతిలో డబ్బులు లేకుండా రోడ్డెక్కొచ్చు. ఇల్లు చేరొచ్చు. కదలొచ్చు. ఇందులో కదలిక ముఖ్యం. దిల్లీ ఈ విషయంలో దారి చూపింది. గల్లీల దాకా దాని ప్రయాణం సాగాల్సిందే. అందరికీ ఉచితం అవసరమా అనిపించొచ్చు. అవును నిజమే.ఇందులోనూ మార్పులు చేయొచ్చు. బహుశా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ విషయం చర్చకు రావొచ్చేమో.కానీ కొన్ని యుగాలుగా వంటగదులకు పరిమితమైన వాళ్లను రోడ్లమీదకు తేవడంలో ఈ రావమ్మా మహాలక్ష్మి పథకం తన వంతు పాత్ర పోషించగలదు. చైతన్యపథంలో మహిళలను మరో మెట్టు ఎక్కిస్తుంది.అందుకని ఇది అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news