YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తాజాగా రాష్ట్రంలో కలకలం రేపుతోంది. తన కుమార్తెను అరెస్ట్ చేయడంతో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లారు. పీఎస్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వారితో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ చేయి చేసుకున్నారు.
నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. పోలీసులకు చేతనైన పని షర్మిలను అరెస్ట్ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. షర్మిలపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైందని పోలీసులు విజయమ్మకు సూచించారు. అనంతరం పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు. ఈ అంశంపై కాసేపట్లో హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ విజయమ్మ ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు.