మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తో పాటు సిబిఐ, వైయస్ సునీత వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ల పైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారని, చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా జైల్లోనే ఉంచాల్సిన అవసరం లేదని సునీల్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే వివేకా హత్య కేసు ప్రస్తుతం కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇవ్వరాదని కోర్టును కోరింది సిబిఐ. ఈ హత్య కేసులో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు వివరించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, పాదర్శక దర్యాప్తు ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది.