కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాలూ ముస్తాబయ్యాయి. జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు కృష్ణస్వామివారిని ముఖమండపంలో అమ్మవారి ఉత్సవరులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగనున్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాయించనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 3న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుదర్శన చక్రత్తాళ్వార్‌కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.