తెలంగాణలో పత్తి రైతుల మద్దతు ధర లేక రోడ్డెక్కారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాయడం తెలిసిందే. పత్తి క్వింటాలు రూ.15 వేల ధర లేనిదే రైతులకు గిట్టుబాటు కాదని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడివా? లేక కేంద్రానికి వంతపాడుతున్నావా? అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పత్తి గిట్టుబాటు ధర రాష్ట్రం పరిధిలో ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా, సీఎంకు లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మాట తప్పిన కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశావా? అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ‘పంట ఏదైనా వ్యాపారులు, దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మద్దతు ధర అంటూ రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల మధ్య ఉన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే… రైతులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? వానలు, చీడపీడల బెడదను తట్టుకుని పండిన పత్తిని చూసి రైతాన్న అనందం మార్కెట్లో ధర చూడగానే ఆవిరైపోతుంది. దళారులు రాజ్యంలో గిట్టుబాట ధర రాకపోవడంతో రోడ్డెక్కి ఆందోళ చేయాల్సిన స్థితి దాపురించింది. క్వింటాలుకు రూ.6-7 వేలు చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడిని పరిగణనలో తీసుకుంటే కనీసం రూ.15 వేలు రాకుంటే గిట్టుబాటు కాని పరిస్థితి.’ అంటూ సీఎంకు రేవంత్ లేఖ రాశారు.