తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్) మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంత త్వరగా ఆ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర రాష్ట్రాల నేతల మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు అనువుగా దేశ రాజధాని దిల్లీలో సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
టీఆర్ఎస్ కు దిల్లీ వసంత్ విహార్‌లో కేటాయించిన స్థలంలో ఇప్పటికే సొంత భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యేందుకు మరికొంత కాలం పట్టనుండడంతో అప్పటివరకు అద్దె భవనంలో బీఆర్ఎస్ కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం దిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ సమీపంలోని పాలికా మిలాన్ కావెంటర్ లేన్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. లోపల కొన్ని మార్పులు చేస్తున్నారు.
మరో ఆరు నెలల్లోగా దిల్లీ వసంత్ విహార్ లో ఏర్పాటు చేస్తోన్న బీఆర్ఎస్ సొంత భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. స్వయంగా తానే ఆ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.