అసలే కష్టాల్లో ఉన్న టీడీపీని బతికించుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఒకపక్క చంద్రబాబు ఇంత కష్టపడుతుంటే.. మరోపక్క, తమ్ముళ్లు చేస్తున్న దూకుడు ప్రయత్నాలతో పార్టీ పరువు అడ్డంగా పోతోంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పార్టీని బతికించే వారు కరువ య్యారు. ఎవరూ కూడా పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు రాకపోగా.. పార్టీ పరువును పోగొట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రవిచంద్ర యాదవ్.. వివాదాస్పద వైఖరితో పార్టీ పరువు పోయిందనే టాక్ వినిపిస్తోంది.
ఏ నాయకుడైనా… తాను పుట్టిపెరిగిన ఊరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న దానిని డెవలప్ చేసేందుకు ప్రయత్ని స్తారు. లేదా.. మౌనంగా ఉంటారు. పుట్టిన ఊరుపై, ఆ ఊరు జనాలపై ఎలాంటి కామెంట్లూ చేయరు. కానీ, నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ మాత్రం తాను పుట్టిన ఊరును చులకన గా మాట్లాడారు. ఆ ఊరుకు చెందిన జనాలను ఆయన పురుగులుగా చూశారు ఈ పరిణామం ఆయనకు వ్యక్తి గతంగానే కాకుండా .. పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చింది.
విషయం ఏంటంటే.. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో శివాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈ గ్రామం సమీపంలోని ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలివచ్చారు. ఇంతలో.. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చారు. అంతేకాక.. మత్స్యకార మహిళల వద్ద మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్రస్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ మండిపడ్డారు.
అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో మాట్లాడితే రూ.10,000, ఫోన్‌లో మాట్లాడితే రూ.3,000 జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, రేపు ఏకంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు కూడా వేయొద్దని ఒట్టు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? అనేది విశ్లేషకుల మాట. ఏదేమైనా.. టీడీపీ ఎమ్మెల్సీ దూకుడుతో పార్టీ పరువు పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.