ఆంధ్రా ప్యారిస్ లో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికలు

-

గుంటూరు జిల్లాలో గుంటూరు తర్వాత అతి పెద్ద పట్టణంగా పేరున్న ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో పురపాలక ఎన్నికల జోరు మొదలైంది. 112 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి, జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొంది, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న తెనాలి చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి.అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన కూడా తమ అభ్యర్థులను బరిలో దింపి గెలుపుపై ధీమాగా ఉన్నాయి. దీంతో తెనాలిలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది.

తెనాలి మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. పట్టణంలో లక్షా 50 వేల మంది ఓటర్లు ఉన్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు అన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయగా..కాంగ్రెస్ 10 వార్డుల్లోనూ, జనసేన 14 చోట్ల, బీజేపీ 8 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. మొత్తం 184 మంది నామినేషన్లు దాఖలు చేస్తే… పరిశీలనలో నలుగురివి తిరస్కరించారు. ప్రస్తుతం 180 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో..ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు వార్డుల వారీగా క్రియాశీలక కార్యకర్తలు, అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన సూచనల మేరకు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా రంగంలోకి దిగి అభ్యర్థులతో పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థులు కూడా వార్డుల్లో ప్రచారాన్ని ప్రారంభించారు.

తెనాలి మున్సిపల్ చైర్‌పర్సన్‌ పీఠం ఈసారి ఓసీ మహిళకు రిజర్వు కావడంతో… వైసీపీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా సయ్యద్ ఖాలేదా నసీం పేరును ఆ పార్టీ ప్రకటించింది. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. 8వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసిన జెట్టి రేణుక… టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది. మొత్తమ్మీద చైర్‌పర్సన్‌ పీఠంతో పాటు… రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం మహిళలు కౌన్సిల్లో అడుగుపెట్టనున్నారు. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

విజయంపై వైసీపీ, టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా… కొన్ని వార్డుల్లో మాత్రమే పోటీ చేస్తున్న జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌… అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఏ మేరకు పోటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news