జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వద్దకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెళ్ళేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాశీంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసిన రేవంత్రెడ్డి… భూపాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న క్రమంలో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు వందమంది సభ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని పక్కనే ఉన్న సినిమా థియేటర్లో నిర్బంధించి ఉంచి గేట్లు మూసేశారు.
అయినా కూడా ఆగని బీఆర్ఎస్ కార్యకర్తలు సభ జరుగుతున్న ప్రదేశం పైకి రాళ్లు, కోడి గుడ్లతో దాడులు చేశారు. వెంటనే సభ వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, సినిమా థియేటర్ లోపల ఉన్న బీఆర్ఎస్ శ్రేణులతో రాళ్లు, సీసాలతో దాడులు చేశారు. పరస్పరం ఒకరికొకరు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసుకోవడంతో పది నిమిషాలు పరిస్థితి రణరంగంగా మారింది. ఈ క్రమంలో కాటారం ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు. పలువురు కార్యకర్తలు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.