ఏపీలో కోడిపందాలపై ఉత్కంఠ.. ఉన్నట్టా ? లేనట్టా ?

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకువచ్చేది కోడి పందాలు. మరీ ముఖ్యంగా కోస్తాంధ్రలోని కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలలో ఈ కోడి పందాలు భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది కోడి పందేలు జరగకుండా చూడమంటూ కోర్టులు ఆదేశాలు ఇవ్వడం, అందుకు అనుగుణంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఈ కోడిపందాలు అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం పరిపాటే. కానీ చివరికి రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు సైడు అవుతుంటారు. కానీ ఈ ఏడాది ఎందుకోగానీ ముందు నుండీ సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే భారీ ఎత్తున సిద్ధం చేసిన పందాల బరులను ధ్వంసం చేస్తున్నారు.

అలానే కోడి పందాలు ఉపయోగించే కోడి కత్తులు తయారు చేసే వాళ్ళని కూడా గుర్తించి కోడి కత్తులను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కోడి పందాలు జరుగుతాయి లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అనుమతుల కోసం పందాల నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల రహస్యంగా బరులు సిద్ధం చేశారు. ఏ క్షణమైనా అనుమతులు రావచ్చంటూ ప్రచారం చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే పోలీసు అధికారులతో టచ్ లో ఉన్నారు పందాల నిర్వాహకులు.  అనుమతి కోసం ఉన్నత స్థాయి అధికారులతో  వైసీపీ నేతల మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు.