అనంతపురం జిల్లా చిత్రావతి రిజర్వాయర్ ముంపు నిర్వాసిత గ్రామమైన మర్రిమేకలపల్లి ఆందోళనలతో అట్టుడుకింది. పరిహారం చెల్లింపులో న్యాయం చేయలేదని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కూల్చివేతలకు వచ్చిన అధికారులు, పోలీసులపై తిరగబడ్డారు. అయితే నష్టపరిహారం చెల్లించిన తరువాతే ఇళ్లను కూలుస్తామన్న అధికారులు హామీ ఇచ్చిన గంటకే కూల్చివేతలు ప్రారంభించారు.
ఆర్డీవో హామీ ఇచ్చిన గంట వ్యవధిలోనే అధికారులు జెసిబితో ఇళ్లు కూల్చేందుకు యత్నించారు. ఓ ఇంటిని కూలుస్తున్న సమయంలో గోడ కూలి ఇంట్లోనే ఉన్న బాలునిపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో గ్రామస్తులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గాయపడ్డ బాలుడిని ఆర్డీవో వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జేసీబీలను గ్రామం నుంచి తక్షణం బయటకు తీసుకెళ్లాలని , లేకుంటే వాటిని ద్వంసం చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు.