వరంగల్ జిల్లా ఎంజీఎం మార్చురీ నుంచి రాకేష్ అంతిమ యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే రాకేష్ అంతిమయాత్ర లో ఉద్రిక్తత నెలకొంది. మొదట వరంగల్లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు కొంతమంది యువకులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి రాకేష్ మృతదేహాన్ని రైల్వే స్టేషన్ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరసనకారులు వరంగల్ రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చారు.
స్టేషన్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ గొడౌన్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. రాకేష్ అంతిమ యాత్ర కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సహా ఎమ్మెల్యేలు ఎంపీలు వెంట నడవడంతో అంతిమయాత్ర కొనసాగుతోంది.