డీకే ఆదికేశవులు నాయుడు కేవలం చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా.. ఏపీ రాజకీయాల్లోనూ చాలా మందికి సుపరిచితులే. చిత్తూరు ఎంపీగా రెండుసార్లు విజయం సాధించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆయన కోరుకున్న టీటీడీ చైర్మన్ కూడా అయ్యారు. ఆ తర్వాత ఆయన మృతి చెందాక ఆ కుటుంబం రాజకీయంగా కొద్ది రోజులు సైలెంట్ అయ్యింది. 2014 ఎన్నికల వేళ చంద్రబాబు విన్నపం మేరకు టీడీపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో డీకే భార్య సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే గత ఎన్నికలకు ముందు సత్యప్రభకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఆమెను బలవంతంగా చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి తప్పించి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయించారు. అక్కడ మిథున్‌రెడ్డి వైసీపీ నుంచి బలంగా ఉన్నారు. ఓడిపోతానని తెలిసినా కూడా సత్యప్రభ అక్కడ అయిష్టంగానే పోటీ చేసి ఓడిపోయారు. గతంలో సత్యప్రభ కుమారుడు శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో సత్యప్రభ ఎంపీగా ఓడిపోయాక రాజకీయంగా డీకే కుటుంబం పూర్తి సైలెంట్‌గా ఉంటూ వస్తోంది.
ఇక ఇప్పుడు సత్యప్రభతో పాటు ఆమె కుమారుడు శ్రీనివాస్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోకి తీసుకు వచ్చేందుకు మంత్రాంగం నడుపుతున్నారట. జగన్ ఇటీవల తిరుమల వచ్చినప్పుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శ్రీనివాస్‌ను వెంట బెట్టుకుని మరీ జగన్ దగ్గరకు తీసుకు వెళ్లారు. దీంతో డీకే ఫ్యామిలీ ఇక వైసీపీలో చేరడం లాంఛనమే అన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం జోరందుకోవడంతో శ్రీనివాస్ తాము వైసీపీలో చేరుతున్నట్టు వస్తోన్న వార్తలను ఖండించారు.
తాను జగన్‌ను కలవడం వెనక రాజకీయ కారణాలు లేవని.. తన తండ్రి ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శ్రీవారి ఆనంద నిలయాన్ని బంగారు తాపడం చేయాలన్న ఆలోచనతో ఆనంద నిలయం – అనంత స్వర్ణమయం పథకం తెరపైకి తెచ్చారని.. అయితే ఈ పథకం కొన్ని కారణాలతో ఆగినందున దానిని తిరిగి ప్రారంభించాలని జగన్‌ను కోరినట్టు చెప్పారు. శ్రీనివాస్ వివరణ ఎలా ఉన్నా డీకే ఫ్యామిలీ పార్టీ మార్పు దాదాపు ఖాయమే అన్న టాక్ చిత్తూరు రాజకీయాల్లో వినిపిస్తోంది.