గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అయితే, ఆయన ఇంతగా మెజారిటీ సాధించి గెలుపు గుర్రం ఎక్కినా.. ఒక్క నిముషం కూడా ఆయన ముఖంలో ఆనందం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు, దాదాపు ఏడాది కాలంగా ఆయన ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు? అనే విషయాలు కూడా తెలియడం లేదని చెబుతున్నారు. దీంతో మాగుంట కేడర్ అల్లాడిపోతోంది. “మా సార్.. గతంలో ఏ పార్టీలో ఉన్నా.. మాకు పనులు చేసేవారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా మాకు పనులు చేయలేకపోతున్నారు“ అని కేడర్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
మరి సీనియర్ నాయకుడు. కాంగ్రెస్‌లో నాలుగు సా్ర్లు ఇదే ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన దిట్ట.. రాజకీయంగా చక్రం తిప్పిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఇప్పుడు ఎందుకు డీలా పడ్డారు? అనే ప్రశ్నలు సహజంగానే తెరమీదికి వస్తున్నాయి. ఈ విషయాలను పరిశీలిస్తే.. వైసీపీకి ఇక్కడ కీలక నేతలు ఉన్నారు. వీరిలో ఇద్దరు మంత్రులు కూడా. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదమూలపు సురేష్‌లు మంత్రులుగా ఉన్నారు. ఇక, మాజీ ఎంపీ.. ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వంటివారికి జిల్లా కొట్టిన పిండి. పైగా ఇప్పటికీ వీరిదే హవా కొనసాగుతోంది.
వారు చెప్పినట్ట అధికారులు నడుస్తున్నారు. తమ అనుకున్న వారికే వీరు పనులు చేస్తున్నారు. దీంతో ఇతర నేతల వైపు అధికారులు అడుగు కూడా కదపలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో మాగంట శ్రీనివాసుల రెడ్డి ఈ ముగ్గురిలో ఏ వర్గమూ కాదు. నిన్న మొన్నటి వరకు ఆయన టీడీపీలో ఉన్నారు. దీంతో వీరు ఆయనను దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది. పోనీ.. అధికారులైనా పనులు చేస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. మంత్రుల కనుసన్నల్లోనే వారు ముందుకు సాగుతున్నారు. లేదంటే.. వైవీ సార్ చెప్పినట్టే నడుచుకుంటున్నారు.
ఫలితంగా మాగుంట తన పనులు చేయించుకోలేక.. తనను నమ్ముకున్న కేడర్ కు పనులు చేయించలేక తీవ్రంగా సతమతమవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఆయన గత చంద్రబాబు హయాంలో టీడీపీలో ఉన్నారు. అప్పట్లో ఆయన ఒంగోలు నుంచి ఓడిపోవడంతో ఎమ్మెలల్సీని చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. తన పనులు చేయించుకోవడంతోపాటు.. తన కేడర్‌ను కూడా సంతృప్తి పరిచారు. కానీ, ఇప్పుడు ఎంతో పవర్ ఫుల్ పదవి అయిన ఎంపీగా ఉండి కూడా పనులు చేయించుకోలేక పోతుండడంతో గడప కూడా దాటడం లేదని అంటున్నారు. మరి వైసీపీ పద్మవ్యూహం నుంచి ఎప్పుడు బయట పడతారో చూడాలి.