పూణే లో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. పూణేలో మాస్కు పెట్టుకోలేదని ఒక కారులో వెళుతున్న వ్యక్తిని అడ్డుకునేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ అబూ సావంత్ ప్రయత్నించాడు. అయితే అందులో వ్యక్తి మాత్రం ఏమి అనుకొన్నాడో ఏమో ఆపకూడదు అని ఫిక్స్ అయ్యాడు. అయినా సరే అతనిని ఎలా అయినా ఆపాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ కారుకు అడ్డం రావడంతో కారుతో అతన్ని గుద్దించేశాడు డ్రైవర్. దీంతో కానిస్టేబుల్ ఎగిరి కార్ బ్యానెట్ మీద పడ్డాడు.
అయినా కారు ఆపని సదరు వ్యక్తి ఏకంగా కానిస్టేబుల్ ని అలా బ్యానెట్ మీదనే ఉంచి కిలోమీటర్ల మేర వాహనాన్ని నడిపాడు. అయితే ఇదంతా చూస్తున్న రోడ్డు మీద ఉన్న మిగతా వాహనదారులు ఆకారాన్ని ఆపడానికి ప్రయత్నించిన వారిని కూడా డ్రైవర్ గుద్దించే ప్రయత్నం చేశాడు. చివరకి పెద్ద పెద్ద వాహనాలు అడ్డం పెట్టడంతో ఆ డ్రైవర్ కారు ఆపక తప్పలేదు. ఇక ఆ కారు నడిపిన యువరాజ్ అనే వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్ కింద 307 సెక్షన్, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు 353 సెక్షన్, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మీద హాని చేసినందుకు 333 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.