ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కేంద్రం..8వ వేతన సంఘంపై క్లారిటీ..

-

ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపు పై ఎన్నో చర్చల అనంతరం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే..జీతాల పెంపునకు సంబంధించి పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన వెలువడింది. 7వ వేతన సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోని స్థితిలో రాబోయే కాలానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయబోవడంలేదని కేంద్రం స్పష్టం చేసింది..ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో తెలిపారు..

ప్రభుత్వ ఉద్యోగులకు 8వ కేంద్ర వేతన సంఘం సకాలంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందా? తద్వారా జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదా? అంటూ ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎంపీ దీపక్ బాజి, బీహార్ బీజేపీ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయబోమని ప్రకటించడం ద్వారా రాబోయే కాలానికి కూడా 7వ వేతనం సంఘం సిఫార్సులనే అమలు చేయనున్నట్లు మోదీ సర్కార్ యోచిస్తోందని తెలుస్తుంది.

7వ పే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఉద్యొగుల లో కొత్త ఆందోళన మొదలైంది..1947 నుంచి ఇప్పటి వరకు ఏడు పే కమీషన్లు ఏర్పాటయ్యాయి. ఆర్థిక శాఖ పరిధిలో వ్యవహరించే పే కమిషన్లు.. ప్రతి పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ సవరించేందుకు నిర్దేశించారు. చివరిగా 7వ కేంద్ర వేతన సంఘాన్ని భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలున్నాయి.
ఇది ఇలా ఉండగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా జీతాలను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యల గురించి కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందించారు. ఉద్యోగుల జీతాల వాస్తవ విలువలో కోతను భర్తీ చేయడానికి వీలుగా డియర్‌నెస్ అలొవెన్స్ ఇస్తున్నామని మంత్రి మరో ప్రశ్నకు బదులిచ్చారు. భారత వినియోగదారుల ధరల సూచిక కింద అంచనా వేసిన ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్టు తెలిపారు. 8వ వేతన సంఘం ఉండదన్న కేంద్రం ప్రకటనపై ఉద్యోగ సంఘాల స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news