హైదరాబాద్ రాజేంద్రనగర్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలోంచి 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
ఈ భూములను కేటాయిస్తూ గతేడాది డిసెంబరు 31వ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు.పాతబస్తీలోని ప్రస్తుత భవనంలో 104 ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ప్రస్తుత భవనంలో 2009లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కొత్త భవనం నిర్మాణం కోసం చర్చ, ప్రతిపాదనలు మొదలయ్యాయి. పెరిగిన జడ్జిలకు అనుగుణంగా భవనం సరిపోకపోవడం, పార్కింగ్, తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొత్త భవనం నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గు చూపింది.