కొండా దంపతుల పక్క చూపులు..కమలం ఆకర్ష్ కి చిక్కినట్టేనా ?

-

కొండా దంపతులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా.. కొన్నాళ్లుగా స్థబ్దుగా ఉనా కొండా కపుల్ అడుగులు ఎటువైపు పడుతున్నాయి..బీజేపీలోకి జంప్‌ అంటూ జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం.. కమల దళానికి వారు పెట్టిన షరతుల పై ఇప్పుడు ఓరుగల్లు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది పేర్లు కూడా చర్చలోకి వస్తున్నాయి. ఆ జాబితాలో వరంగల్‌ జిల్లాకు చెందిన కొండా దంపతులు కూడా చేరారు. బీజేపీ నేతలతో సురేఖ, మురళీ దంపతులు టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. అయితే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌తో భేటీ అయ్యాక పరిస్థితులు మారినట్టు తెలుస్తోంది. మరి.. ఈ మధ్యలో ఏం జరిగింది? ఎందుకు కొండా దంపతుల పేరు చర్చల్లోకి వచ్చిందన్నది ఆసక్తిగా మారింది.

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాల్‌ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఓరుగల్లు రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న కొండా సురేఖ, మురళీ దంపతులు తూర్పు నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకొనేందుకు కొన్ని రోజులుగా పావులు కదుపుతున్నాయి. అయితే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ వలకు కొండా దంపతులు చిక్కినట్టు సమాచారం.

కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నట్టు వరంగల్‌ జిల్లాలో ప్రచారం జోరందుకుంది. అయితే కమలనాథుల దగ్గర కొన్ని షరతులు పెట్టినట్టు సమాచారం. తమ కుమార్తె సుస్మితా పటేల్‌కు భూపాలపల్లి అసెంబ్లీ టికెట్‌ అడుగుతున్నారట. కిందటి ఎన్నికల్లోనే ఆమెను భూపాలపల్లి నుంచి పోటీ చేయించాలని చూశారు. అయితే భూపాలపల్లిలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు చందుపట్ల కీర్తిరెడ్డి ఉన్నారు. అక్కడ జంగారెడ్డిని కాదని కొండా దంపతుల కుమార్తెకు బీజేపీ వాళ్లు టికెట్‌ ఇస్తారా అన్నది ప్రశ్న.

కొత్త పీసీసీ చీఫ్‌ ఎన్నిక కోసం కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌.. కొండా దంపతులతోనూ సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా బీజేపీ టాపిక్‌ వచ్చిందట. కానీ.. కాంగ్రెస్‌లో ఉంటున్నట్టు వారు చెప్పారట. కాంగ్రెస్‌లోనే ఉంటే వరంగల్‌లో మీకు ప్రాధాన్యం ఉంటుందని.. మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఠాగూర్‌ వారితో చెప్పినట్టు సమాచారం. అయితే బీజేపీని బూచిగా చూపించి.. కాంగ్రెస్‌లో తమ పట్టు నిలుపుకోవడం కోసం కొత్త ఎత్తుగడ ఏమైనా వేశారా అన్న అనుమానాలు ఉన్నాయట. ప్రజల్లోను, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోనూ తన పట్టు సడలలేదని చెప్పడానికి తీసిన రాజకీయ అస్త్రంగా కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయట.

ఒకవేళ బీజేపీలో భవిష్యత్‌ బాగుంటుందని భావించి.. కుమార్తెకు భూపాలపల్లి టికెట్‌ ఇస్తామని కమలనాథులు చెబితే కొండా దంపతులు కాంగ్రెస్‌లో ఉండరన్నది ఒక వాదన. మొత్తానికి కీలక సమయంలో చర్చలోకి వచ్చిన కొండా దంపతులు కాంగ్రెస్‌లోనే ఉంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news