దేవశయనీ ఏకాదశి ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే మొదటి ఏకాదశిని దేవశయనీ ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాం పొందాలనుకునేవారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల తప్పనిసరి ప్రతి ఏడాది శయనీ ఏకాదశిని ఆచరించాలి అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా ఆషాఢమాసం వస్తుంది. ఆ మాసంలో శుక్ల పక్షం నాడు ఆ జగన్నాధుని శయనింపిజేయాలి అంటారు. మళ్లీ కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని మేలుకొలపాలి.
ఈరోజు ఉపవాసం ఉండి చాతుర్మాస వ్రతమాచరించాలి అంటారు. శంఖ చక్రము గధని ధరించిన విష్ణుమూర్తికి పట్టువస్త్రాలు ధరింపజేసి, పీఠం పై తెల్లని వస్త్రాన్ని పరచి రెండవైపుల దిండ్లను పెట్టి శ్రీ మహావిష్ణువుని పరుండబెట్టాలి. విష్ణుసహస్రనామాలను పాటించాలి. విష్ణు ప్రతిమకు పాలు,నెయ్యి తేనే, పెరుగు, పంచదారతో స్నానం చేయించాలి. ఆ తర్వాత తులసి మాల ధారణ చేసి, అలంకరించి ధూపం వేయాలి. చక్కని సుగంధ పూలతో అర్చించి, విష్ణుమంత్రాన్ని పాటించాలి. ఈ విధంగా విష్ణువును 16 ఉపచారాలతో పూజించాలి. పవిత్రమైన మనస్సుతో ఆ దేవదేవుని పూజించాలి. స్త్రీ, పురుషులు ఇద్దరూ చేయవచ్చు.
వ్రత కథ
భక్త ప్రహ్లాదుని మనుమడు రాజ మహబలి ఉండేవాడు. అతడు మూడు లోకాలను పాలించేవాడు. దేవలోకం, పృథ్వీలోకం, పాతాళలోకం. అతడు అసురుడు అయినప్పటికీ చాలా దయాగుణం కలిగిన వాడు. ప్రజలందరూ అతన్ని ఎంతో అభిమానిస్తారు. ఈవిధంగా అతడు అజేయుడు అవుతాడని తలచిన దేవతలు విష్ణుమూర్తిని సాయం కోరతారు. మహాబలి శక్తులను అనచాలని వేడుకుంటారు. అందుకే దేవతలను కాపాడటానికి విష్ణుమూర్తి వామన అవతారాన్ని ఎత్తుతాడు.
దాతృత్వానికి మరోపేరు అయిన మహాబలి కోసం విష్ణువు చిన్న బ్రాహ్మణ బాలుడి వేషంలో వెళ్లి అతడిని భిక్ష అడుగుతాడు. ఈ మూల్లోకాల్లో మూడు పాదాలకు సరిపోయే భూమిని ఇవ్వమని రాజును అభ్యర్థిస్తాడు. దీంతో తక్షణమే మహాబలి అంగీకరిస్తాడు. దీంతో వామన అవతారంలో ఉన్న విష్ణువు పెద్దగా ఎదుగితే తల ఆకాశాన్ని తాకుతుంది. భూమిని ఒక అడుగుతో కప్పేస్తాడు. స్వామిని గుర్తించిన మహాబలి వినయంగా లొంగిపోతాడు. మూడవభాగానికి అతని తలని అర్పిస్తాడు.
పాతాలలోకాని పంపే ముందు రాజు ఔధర్యాన్ని మెచ్చిన విష్ణువు అతనికి ఓ వరం ఇస్తాడు. తనతోపాటు పాతాళలోకానికి రమ్మని కోరగా, వర గౌరవానికి భగవంతుడు మహాబలితో కలిసి పాతాళలోకానికి వెళ్తాడు. దీంతో దేవతలు, లక్ష్మీదేవి ఆందోళన చెందుతారు. దీంతో భర్తను తిరిగి తీసుకురావడానికి లక్ష్మిదేవి పేద మహిళ రూపంలో పాతాళలోకానికి వెళ్తుంది. మహాబలికి రాఖీ కట్టి తనను సోదరి లాగా భావించి తన భర్త అయిన విష్ణుమూర్తిని విడిపించమని కోరుతుంది. దీనికి మహాబలి వినయంగా అంగీకరించి విష్ణువును తనతో పంపిస్తాడు.