హైదరాబాద్ ‘ప్రజాభవన్’లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు విభజన అంశాల పరిష్కారంపై చర్చించారు. రెండు రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారుల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని భేటీలో నిర్ణయించారు.
భద్రాచలం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను అడిగినట్లు సమాచారం. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ లోని కొన్ని భవనాలు తమకు కేటాయించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అడగ్గా.. రేవంత్ రెడ్డి సర్కారు తిరస్కరించినట్లు సమాచారం.