కరోనాతో యావత్ ప్రపంచం తలకిందులైంది.. ఎంతోమందిని పోగుట్టుకున్నాం.. జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. కరోనా కాస్త సైడిచ్చింది అనేలోగా.. రకరకాల వైరస్‌లు యటాక్ చేయడం మొదలుపెట్టాయి.. ముఖ్యంగా ఇవి చిన్నపిల్లల్నే టార్గెట్ చేశాయి. తాజాగా బ్రిటన్లో ‘స్ట్రెప్ ఎ’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. ఇది పిల్లలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అమెరికాలో కూడా దీని కేసులు ఎక్కువగానే బయటపడుతున్నాయి. ఆ రెండు దేశాల్లో కలిపి ఈ వ్యాధి కారణంగా తొమ్మిది మంది పిల్లలు మరణించారని వైద్య అధికారులు తెలిపారు..వారిలో అధికంగా పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు. దీంతో ఆయా దేశాల ఆరోగ్య శాఖలు పిల్లలను జాగ్రత్తగా చూపుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి.
స్ట్రెప్ ఎ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?..
‘స్ట్రెప్ ఎ’ అనేది ఒక బ్యాక్టిరియా. ఇది గొంతు, చర్మంపై వస్తుంది. దీని వల్ల తేలికపాటి జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పటికవరకూ.. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా ప్రాథమికంగా చూపించదు. తరువాత తీవ్రమైన జ్వరంగా, గొంతు ఇన్ఫెక్షన్‌గా మారిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు బ్యాక్టిరియాలు ఎదుటివారిపై పడి వారికి కూడా ఇది వ్యాపిస్తుంది. ఇది పక్కా అంటువ్యాధి..కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు ..
జ్వరం, చర్మంపై దద్దుర్లు, టాన్సిల్స్, మింగేటప్పుడు గొంతు నొప్పి, గొంతు దగ్గరి గ్రంథుల వాపు వంటివి వస్తాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. అలాగే జలుబు చేయడం, విపరీతమైన చెమట పట్టడం, అలసట, చిరాకు, డీహైడ్రేషన్, ఆకలి వేయకపోవడం వంటివి కలుగుతాయి. ముఖ్యంగా పిల్లలు టాన్సిల్స్ నొప్పి అంటున్నా, అవి వాచినా కూడా అస్సలు లైట్ తీసుకోవద్దు..
ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఎలాంటి టీకాలు లేవు. అయితే వాటిపై సమర్థవంతంగా పనిచేయగల అనేక రకాల యాంటీ బయోటిక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే మాస్కులు పెట్టాలి. వైద్యులను సంప్రదించాలి.