దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు – శృంగార గౌరీ కేసులో జిల్లా న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించనుంది. ఈ కేసులోని వాదనలు గత నెలలోనే పూర్తి కావడంతో తీర్పును సెప్టెంబర్ 12 కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.
ప్రశాంత పరిస్థితుల కోసం మత పెద్దలతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేసారు ఐదుగురు మహిళలు. హిందూ ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషన్ల తరఫున లాయర్ మదన్మోహన్ వాదించారు.అయితే నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతాలు, హోటల్లు, అతిథి గృహాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించామన్నారు.