ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..!ఉండాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..!

-

2022కు సంబంధించి .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో న్యూయార్క్​, సింగపూర్​లు టాప్​లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే.. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​కు చెందిన వరల్డ్​వైడ్​ కాస్ట్​ ఆఫ్​ లివింగ్​ రిపోర్టు ఇటీవలే బయటకొచ్చింది. ఏటా.. ఖరీదైన నగరాలపై ఈ రిపోర్టు తయారవుతుంది. ఇక ఈసారి.. తొలి స్థానాన్ని న్యూయార్క్​, సింగపూర్​లు సంయుక్తంగా తీసుకున్నాయి.. ప్రపంచంలోని 172 ప్రధాన నగరాల్లో.. ఏడాది కాలంలో కాస్ట్​ ఆఫ్​ లివింగ్​ అనేది 8.1శాతం పెరిగిందని ఈ నివేదిక చెబుతోంది.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, సప్లై చెయిన్​ వ్యవస్థలో ఇబ్బందులు వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయట..

గతేడాది విడుదలైన అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి స్థానాన్ని సంపాదించుకున్న టెల్​ అవీవ్​(ఇజ్రాయెల్​).. ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక హాంగ్​కాంగ్​, లాస్​ ఏంజెల్స్​లు 4,5 స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఆసియాలోని నగరాల్లో ఖర్చులు కాస్త తక్కువగా ఉన్నాయి. ఇక్కడ సగటు జీవన వ్యయం 4.5శాతం పెరిగింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో.. జపాన్​లోని టోక్యో, ఓసాకా నగరాలు.. తాజా ర్యాంకింగ్స్​లో 24, 33 స్థానాలు పడ్డాయి. సిరియా రాజధాని డమస్కస్​, లిబియాలోని ట్రిపోలి నగరాలు.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ.. ఈ జాబితాలోని టాప్​-10లో చోటు సాధించింది.

గతేడాది 24వ స్థానంలో ఉన్న శాన్​ఫ్రాన్సిస్కో.. ఈసారి 8వ స్థానానికి చేరడం గమనార్హం. చైనాలోని ఆరు ఖరీదైన నగరాలకు సంబంధించిన ర్యాంకులు కూడా పెరిగాయి. షాంఘై.. టాప్​-20లోకి చేరింది. ఈ ఏడాది ఆగస్టు- సెప్టెంబర్​ మధ్యలో ఈ సర్వే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 172 ప్రధాన నగరాల్లో 200 ప్రాడక్టుల ధరలను పోల్చి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది.

2022 అత్యంత ఖరీదైన నగరాల జాబితా ఇదే
1- సింగపూర్​- న్యూయార్క్​
3- టెల్​ అవీవ్​ (ఇజ్రాయెల్​)
4- హాంగ్​కాంగ్​ (చైనా)
5- లాస్​ ఏంజెల్స్​ (యూఎస్​)
6- జురిచ్​ (స్విట్జర్లాండ్​)
7- జెనీవా (స్విట్జర్లాండ్​)
8- శాన్​ ఫ్రాన్సిస్కో (యూఎస్​)
9- పారిస్​ (ఫ్రాన్స్​)
10- కోపన్​హాగెన్​ (డెన్​మార్క్​)- సిడ్నీ (ఆస్టేలియా)
ఇండియాలో ఢిల్లీ, ముంబై నగరాల జీవన వ్యయం పెరిగినా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల జాబితా టాప్​-10లో మాత్రం ఇవి లేవు.

Read more RELATED
Recommended to you

Latest news