సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతున్న ఈసీ కేసులు

-

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలుపు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు టిఆర్ఎస్ శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ తప్పుడు పద్ధతులను అవంలబిస్తోందని కాంగ్రెస్,బీజేపీ ఫిర్యాదులతో అధికార పార్టీని కేసుల బెడద వేధిస్తోంది. విపక్షాల ఆరోపణల సంగతి ఏమో కానీ.. టిఆర్ఎస్ నేతలను మాత్రం ఈసీ కేసులు టెన్షన్ పెడుతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు ఇప్పుడు నాగార్జున సాగర్‌లోనే తిష్ట వేశారు. టిఆర్ఎస్ నేతలు రెండు నెలల నుంచి ఇక్కడే మకాం వేసి సాగర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా మరోసారి గెలిచి రికార్డు సృష్టించాలని జానారెడ్డి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే అధికార పార్టీ మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తు అక్రమాకలకు పాల్పడుతోందని ఫిర్యాదులు ఇస్తోంది కాంగ్రెస్. దీంతో టిఆర్ఎస్ మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు ఎన్నికల కమిషన్‌కు తప్పటం లేదు.

కేసీఆర్ ప్రభుత్వం పిఆర్‌సి ఇచ్చి ఉద్యోగులకు మేలు చేసిందని టీఎన్‌జీవోలు చెబుతున్నారు. టిఆర్ఎస్‌కు మద్దతుగా పని చేయాలని విజయోత్సవ సభ సైతం నిర్వహించారు. నాగార్జున సాగర్ గెస్టు హౌస్‌లో టిఎన్‌జీఓ ఉద్యోగ సంఘం నాయకులు నిర్వహించన సభ వివాదస్పదంగా మారింది. ప్రభుత్వ గెస్టు హౌస్‌లో సమావేశాలు పెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవం ఎలా నిర్వహిస్తారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల్లో గెలుపు కోసం మండలాల వారీగా సామాజిక వర్గాల వారీగా నేతలను ప్రచారానికి దింపింది అధికార పార్టీ. అధికార పార్టీకి అనుకూలంగా త్రిపురారం మండలం సత్యంపాడు గ్రామంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గిరిజనులతో ప్రమాణం చేయించారు. తామంతా తమ దేవుడు అయిన సేవాలాల్ మీద ప్రమాణం చేసి టీఆర్ఎస్‌కే ఓట్లు వేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాణాలపై కాంగ్రెస్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు ఆయన అనుచరుల పై కేసు నమోదైంది. మాస్కులు ధరించకుండా ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ పై తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్లో, బిజెపి అభ్యర్థి పానుగోతు రవికుమార్ పై కేసులు నమోదు చేశారు.

తాజాగా మరో కేసు టిఆర్ఎస్ నేతల నిబంధనల ఉల్లంఘన పై నమోదైంది. ఇలా కేసుల మీద కేసులు టిఆర్ఎస్ నేతల మీద నమోదవుతున్నాయి. మరోవైపు అధికార దుర్వినియోగం,డబ్బుల పంపిణీ పై పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో ఫిర్యాదు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చారు. మొత్తం క్యాబినెట్ అంతా నాగార్జున సాగర్‌లోనే ఉండిపోయిందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలా ఎన్నికల ప్రచారం పూర్తయ్యేసరికి ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అని టెన్షన్ పడుతున్నారు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news