అపెక్స్ కమిటీ భేటీలో తెలంగాణా లేవనెత్తే అంశాలు ఒక్కసారి చూద్దాం. కేంద్రం సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని ఆరోపణ ప్రధానంగా చేయనున్నారు. కృష్ణా, గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని ప్రస్తావించనున్నారు కేసీఆర్. అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేసిందని తెలంగాణా ప్రస్తావిస్తుంది.
కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, కేంద్ర ప్రభుత్వ వైఖరి రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు వివాదాలకు ఆజ్యం పోసిందని ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 క్రింద ట్రిబ్యునల్ కి నివేదించాలని, ఇక పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) పట్టించుకోవడం లేదని అనే విషయాన్ని తీసుకెల్తారు.
పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేకపోయిందనే అంశాన్ని ప్రస్తావిస్తారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనుంది తెలంగాణా. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితోపాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లో అర్థం లేదని… ఇవేవీ కొత్తవి కావని తెలంగాణా ప్రస్తావించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడ అని ఆరోపించానుంది. బేసిన్లు, బేషజాలు లేకుండా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీని సజావుగా జరుపుకోవాలనేదే తమ అభిమతమని స్పష్టం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం దీనికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నదని కేసీఆర్ కేంద్రం ముందు ప్రస్తావిస్తారు.