కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఎక్కడిక్కడ లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వాలు వెంటనే లాక్ డౌన్ అమలు చేశాయి. తర్వాత కరోనా కేసులు తగ్గినట్టు కనిపించడంతో అత్యంత వేగంగా అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నాయి ఆయా దేశాలు. అయితే, ముందు నుండీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లే కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. దీంతో ఆ దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపాల్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ లాంటి దేశాలు మళ్ళీ లాక్ డౌన్ లోకి వెళ్లనున్నాయి.
నేపాల్ మళ్ళీ లాక్డౌన్ అమలు చేయనుందని చెబుతున్నారు. ఫ్రాన్స్ లోకూడా ఈ రోజు నుండి రెండు వారాల పాటు పారిస్ లోని అన్ని బార్‌లు మరియు కేఫ్‌లను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అలానే కచేరీలు, క్రీడా కార్యక్రమాలు, బహిరంగ సభలు వంటి సామాజిక సమావేశాలపై నిషేధాన్ని జర్మనీ ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది. అలానే అక్టోబర్ 1 నుండి, అధిక కరోనా ప్రభావం ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులు 14 రోజులు సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉండాలి. స్పెయిన్ కూడా షాపులు, బార్‌లు వంటి బహిరంగ ప్రదేశాలలో మనుషుల సంఖ్య పరిమితంగా ఉండేలా చూస్తోంది. ఇక ఇటలీలో కూడా నైట్‌క్లబ్‌లు, డ్యాన్స్ బార్‌లు వంటి వాటిని మూసివేశారు. నెదర్లాండ్స్‌లో కూడా తాజాగా లాక్ డౌన్ ఆంక్షలు విధించారు.