ఇండియాలో బర్డ్ ఫ్లూ లెక్క ఇది… ఎన్ని రాష్ట్రాలంటే…!

-

ఉత్తరప్రదేశ్ నుండి బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా శనివారం 1,200 కి పైగా పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. మొత్తం ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల సంఖ్య ఏడుకి చేరుకుంది. మహారాష్ట్రలోని పౌల్ట్రీ ఫామ్‌లో శనివారం 900 కోళ్ళు మరణించాయి. పరీక్షల కోసం నమూనాలను పంపించారు అధికారులు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌తో పాటు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్‌ లలో ఫ్లూ ఉన్నట్లు కేంద్రం నిర్ధారించింది. బర్డ్ ఫ్లూ భయాన్ని దృష్టిలో ఉంచుకుని …. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని నిశేధించడమే కాకుండా నగరంలో అతిపెద్ద ఘాజిపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ ఇప్పటివరకు ఫ్లూ ఉన్నట్లు ధృవీకరించలేదని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్… జలంధర్ ప్రయోగశాలకు నమూనాలను పంపించారని పేర్కొన్నారు. 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత మూడు రోజుల్లో దక్షిణ ఢిల్లీలోని జసోలాలోని ఒక పార్కులో కనీసం 24 కాకులు చనిపోయాయని, ప్రసిద్ధ సంజయ్ సరస్సు వద్ద 10 బాతులు చనిపోయాయని అధికారులు శనివారం తెలిపారు.. బాతుల నమూనాలను పశువైద్య శాఖ అధికారులు తీసుకున్నారు. రాజస్థాన్‌లో 350 కి పైగా పక్షులు చనిపోయాయని, మరణాల సంఖ్య 2,512 గా ఉందని ఒక అధికారి తెలిపారు. శనివారం చనిపోయిన 356 పక్షులలో 257 కాకులు, 29 పావురాలు, 16 నెమళ్ళు మరియు 54 ఇతర పక్షులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news