20 ఏళ్లుగా లీవ్ తీసుకొని అధికారి

-

పోలీసు ఉద్యోగం అంటే.. నిత్యం ఎన్ని స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయో అంద‌రికీ తెలిసిందే. నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డం ద‌గ్గ‌ర్నుంచి స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ర‌క్షించ‌డం, నేత‌ల‌కు భద్ర‌త క‌ల్పించ‌డం, ఉన్న‌తాధికారుల నుంచి ఎదుర‌య్యే ఒత్తిళ్లు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఒక సాధార‌ణ పోలీసు ఉద్యోగికి క‌చ్చితంగా ఉంటాయి. అలాంట‌ప్పుడు వారు సెల‌వులు కూడా తీసుకోవాలి. దాంతో కొంత వర‌కైనా మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న ఆ పోలీసు అధికారి మాత్రం అలా కాదు. 20 ఏళ్ల నుంచి త‌న పోలీసు కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క లీవ్ కూడా పెట్ట‌లేదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆయ‌నే.. ఢిల్లీ రిటైర్డ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల్జిత్ సింగ్ రానా. రానా త‌న 20 ఏళ్ల పోలీస్ ఉద్యోగంలో ఏనాడూ ఎలాంటి లీవ్ కూడా పెట్ట‌లేదు.

బల్జిత్ సింగ్ రానా 1972 సెప్టెంబ‌ర్ 1వ తేదీన పోలీసు ఉద్యోగంలో చేరారు. 9 నెలల ట్రెయినింగ్ అనంత‌రం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కోర్ట్ గేట్ నంబ‌ర్ 1 ద‌గ్గ‌ర పోస్టింగ్ వేశారు. అయితే మొద‌ట్లో రానా కూడా లీవ్‌లు తీసుకునేవాడు. కానీ త‌న తోటి పోలీసులు లీవ్‌ల‌ను అన‌వ‌స‌రంగా తీసుకుంటున్నార‌ని, అలా చేస్తే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సింది ఎవ‌రని త‌న‌కు తానే ప్రశ్నించుకున్నాడు. దీంతో 1998వ సంవ‌త్సరం నుంచి లీవ్‌లు తీసుకోవ‌డ‌మే మానేశాడు. మెడిక‌ల్‌, సిక్‌, క్యాజువ‌ల్.. ఇలా ఎలాంటి లీవ్ కూడా ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకోలేదు. నిరాటంకంగా ప‌నిచేస్తూనే ఉన్నారు.

బల్జిత్ సింగ్ రానాది చాలా క‌ఠిన‌మైన దిన‌చ‌ర్య‌. ఉద‌యాన్నే 5.30 గంట‌ల‌కు నిద్ర లేస్తారు. త‌రువాత‌ ర‌న్నింగ్ కు వెళ్తారు. ఉద‌యం 9 గంట‌ల‌కు డ్యూటీలో రిపోర్ట్ చేస్తారు. రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు విధుల్లో ఉంటారు. అనంత‌రం త‌రువాత రోజు చేసే ప‌ని షెడ్యూల్‌ను నిర్ణ‌యించుకుని కానీ ఇంటికి వెళ్ల‌రు. అలా ఆయ‌న ప‌ని చేస్తున్నారు. అయితే నిజానికి 2012లోనే రానా రిటైర్మెంట్ తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ పోలీసు విభాగంలోనే ఇంకా ప‌నిచేస్తూనే ఉన్నారు. అందుకు గాను ప్ర‌భుత్వం రూ.10,570 అల‌వెన్స్ ఇస్తామ‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ అదేమీ ఆశించ‌కుండా ఉచితంగా పోలీసు విభాగంలో ప‌నిచేస్తున్నారు. ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేష‌న్‌లో కన్స‌ల్టెంట్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫీస‌ర్ గా రానా ప్ర‌స్తుతం విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అలా 1998 నుంచి 2018.. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు సుమారుగా 20 ఏళ్లుగా ఆయ‌న లీవ్ తీసుకోకుండానే పోలీసుగా ప‌నిచేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నార‌ని అడిగితే.. ప్ర‌జ‌ల‌కు, దేశానికి సేవ చేయాల‌నేదే త‌న ల‌క్ష్య‌మ‌ని, త‌న ఊపిరి ఉన్నంత వ‌ర‌కు, కుటుంబ స‌భ్యుల ప్రోత్సాహంతో ఇలా ప‌నిచేస్తూనే ఉంటాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా బ‌ల్జిత్ సింగ్ రానాకు మ‌న‌మంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news