శ్రీలంక దేశం ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో మునిగిపోయింది. దేశ ప్రజలు ఇంధన, నిత్యావసరాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి ఎవరు వస్తారనే విషయంపై యావత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా అనంతరం.. ప్రధాని రణీల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పర్మినెంట్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది.
ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను శ్రీలంక ఇటీవలే ప్రారంభించింది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా స్థానాన్ని భర్తీ చేసేందుకు మంగళవారం ముగ్గురు నాయకులను నామినేట్ చేసింది. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు బరిలో ఉన్నారు. బుధవారం ఎన్నిక జరగనుంది. అయితే పార్లమెంట్ సమావేశానికి కొద్ది సమయం తర్వాత విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.