హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరులో గెలవడానికి అధికార టీఆర్ఎస్ ఎంత కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఈటల రాజేందర్‌ని ఓడించడానికి కేసీఆర్, తన అధికార, రాజకీయ బలాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారు. అసలు సాధారణ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఇంత కష్టపడి ఉండరు…ఇన్ని రకాలుగా పథకాలు ఇచ్చే ఉండరనే చెప్పొచ్చు. అంటే అంతలా హుజూరాబాద్‌లో గెవాలడం కోసం కేసీఆర్ కష్టపడుతున్నారు…ప్రజలని ఆకర్షించడానికి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే కేసీఆర్ కంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ముగ్గురు మంత్రులకు చావో రేవో అన్నట్లు పరిస్తితి తయారైంది. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు బాధ్యతని మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు చూసుకుంటున్నారు. హుజూరాబాద్‌లో ఏం జరిగిన వీరిదే బాధ్యత. మరి హుజూరాబాద్‌లో పరిస్తితులు అనుకూలంగా లేవని అనుకుంటున్నారో లేక, ఇక్కడ రిజల్ట్ ఏమన్నా తేడా కొడితే ఇబ్బంది అవుతుందని అనుకున్నారో తెలియదు గానీ, ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో మంత్రి కేటీఆర్ ఎక్కువ జోక్యం చేసుకోవడం లేదు.
అసలు హుజూరాబాద్‌తో తనకు పెద్దగా సంబంధం లేదన్నట్లుగానే కేటీఆర్ ముందుకెళుతున్నారు. ఏదో రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ తిరుగుతున్నారు గానీ, హుజూరాబాద్‌లో మాత్రం ఎంట్రీ ఇవ్వడం లేదు. అంటే హుజూరాబాద్ ఫలితం అటు ఇటు అయితే హరీష్, కమలాకర్, కొప్పులదే బాధ్యత అవుతుంది.
అందుకే ఆ ముగ్గురు మంత్రులు హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ని గెలిపించడానికి నానా కష్టాలు పడుతున్నారు. అసలు ఈ ముగ్గురు…రాష్ట్రానికి మంత్రులో…హుజూరాబాద్‌కు మంత్రులో అర్ధం కాకుండా ఉంది. ఆ స్థాయిలో ఈ ముగ్గురు నాయకులు హుజూరాబాద్ కోసం పాకులాడుతున్నారు. అయితే ఈ ముగ్గురులో హరీష్‌కే ఎక్కువ బాధ్యత ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన హుజూరాబాద్ భారాన్ని తన భుజాల మీద మోస్తున్నారు. ఏదేమైనా హుజూరాబాద్ ఉపఎన్నికలో రిజల్ట్‌లో తేడా వస్తే ఈ ముగ్గురు మంత్రులే బలి అయ్యేలా కనిపిస్తున్నారు.