హుజూరాబాద్ ఉపఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. రేపో, ఎల్లుండో నోటిఫికేషన్?

కరీంనగర్: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రేపో, ఎల్లుండో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల సంఘం సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ నేతలు ఉపఎన్నిక పోరును ముమ్మరం చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీ నాయకులు ఇప్పటికే పావులు కదుపుతున్నారు.

అటు అధికార పార్టీ  నేతలయితే సంక్షేమ పథకాల పేరుతో హుజూరాబాద్‌లోనే చక్కెర్లు కొడుతున్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నుంచే దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. ఇక ఉపఎన్నిక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

 

అటు ఈటల రాజేందర్ కూడా రేపటి నుంచి మళ్లీ బరిలోకి దిగనున్నారు. అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఉన్న ఆయన గురువారం డిశ్చార్జి కానున్నారు. వచ్చి రాగానే తన ప్రజా దీవెన యాత్రను మళ్లీ షురూ చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. బలమైన అభ్యర్థిని దింపి టీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు ఆ పార్టీ నేతలు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారు. ఈ మేరకు  రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ఈటల ఎలాగో పోటీ చేస్తారు కాబట్టి ఈ ఉపఎన్నిక పోరు రసవత్తంగా మారనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.