తెలంగాణలో మరో 3 మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రాలు

-

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న కేటీఆర్ తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణలో మొత్తం 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మైక్రోసాఫ్ట్‌ సంస్థ నిర్ణయించింది.

గతంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో 3 డేటా కేంద్రాలను ప్రకటించింది. ప్రస్తుతం వాటి ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న సంస్థ… అదనంగా మరో 3 కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇందుకు మరో రూ.16 వేల కోట్ల మేర వెచ్చించనుంది. దీంతో మొత్తం తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు రూ.32 వేల కోట్లకు చేరనున్నాయి.

మైక్రోసాఫ్ట్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ ఆసియా విభాగం అధ్యక్షుడు అహ్మద్‌ మజహరి గురువారం దావోస్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘మైక్రోసాఫ్ట్‌కు తెలంగాణ సౌకర్యవంతమైన రాష్ట్రం. అమెరికా తర్వాత రెండో ప్రాంగణం హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేశాం. మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధితో పాటు రాష్ట్ర పురోగతిలో భాగస్వామిగా ఉన్నందున ఆనందంగా ఉంది. మరిన్ని పెట్టుబడులు పెడతాం. మొత్తం 6 కేంద్రాల నిర్మాణం దశల వారీగా చేపట్టి.. మరో 10, 15 ఏళ్లలో పూర్తిచేస్తాం. ఇదిగాక తెలంగాణలో నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు, క్లౌడ్‌ అభివృద్ధిపైనా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకొని ముందుకు సాగుతున్నాం.’’ అని మజహరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news