ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లాఘాట్ శివారులో నాలుగు పులుల సంచరిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి పులులు యథేచ్ఛగా సంచరించడం చూశాడు. వెంటనే ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పిప్పల్ కోటి బ్యారేజీ పనులకు ఓ డ్రైవర్ మట్టి తరలిస్తున్నాడు. తన వాహనంలో మట్టి తరలించేందుకు వెళ్తుండగా.. గొల్లాఘాట్ శివారులో రహదారి ఓవైపు నుంచి మరోవైపునకు నాలుగు పులులు రోడ్డు దాటడం గమనించాడు. వెంటనే ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్ కెమెరీలో చిత్రించాడు. అనంతరం బ్యారేజీ పనుల పర్యవేక్షణ అధికారికి సమాచారం అందించాడు.
బ్యారేజీ పనుల పర్యవేక్షణ అధికారికి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. పులులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు.
2 నెలల క్రితం ఇదే ప్రాంతంలో పులుల గుంపు సంచరించింది. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్‌గంగ దాటి తరచూ ఇక్కడికి పులులు వస్తుండటంతో పరిసర గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.