తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300ల టికెట్ల ఆన్‌లైన్ కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు ఆసక్తి చూపుతున్నారు. నిన్న స్వామివారిని 45,887 మంది భక్తులు దర్శించుకోగా 17,702 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
మరోవైపు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆరుద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ నటరాజ స్వామివారికి ఏకాంతంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ధనుర్మాస దర్శనం శ్రీ మనోన్మణి సమేత నటరాజ స్వామివారిని, శ్రీ మాణిక్యవాసక స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం శాస్త్రోక్తంగా దీపారాధన నిర్వహించారు.