దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిందని.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే సమయంలో పలు సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపీ భారత ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఫిర్యాదు చేయడం గమనార్హం. రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ని ఉపయోగించి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణంగానే 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తోన్న ప్రధాని మోడీ ఏపీ పర్యటన కోసం ఎయిర్పోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని సాకేత్ గోఖలే ఆరోపించారు.