తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ మధ్య వరి ధాన్యం కొనుగోలు అంశంపై పరస్పరం వ్యక్తిగత దూషణాలు చూసుకునేంతగా వెళ్లింది. తాజా గా మరో సమస్య పై గొంతు వినిపించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధం అవుతున్నారు. ఈ రోజు నాంపెల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. మొదట ఇందిరా పార్క్ వద్ద బండి సంజయ్ దీక్ష చేయాలని భావించినా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే దీక్ష చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ దీక్ష ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ ప్రారంభించనున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగులను పట్టించు కోవడం లేదని.. వారికి ఉద్యోగ నోటిఫికేషన్లు విడదల చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగాలు లేక 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అయినా.. కేసీఆర్ మారలేదని విమర్శించారు. అలాగే నిరుద్యోగ దీక్ష కు వస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను అడ్డుకుని అరెస్టు చేయడం ఎంటి అని ప్రశ్నించారు. తాను దీక్ష చేస్తే.. కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు. కాగ బండి సంజయ్ దీక్ష పై ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం లేదని బండి సంజయ్ దీక్ష చేస్తున్నారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.