కరోనా భయాందోళనల నేపథ్యంలో టోక్యో ఒలంపిక్స్-2020 నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా టోక్యో ఒలంపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయనున్నట్టు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐఓసీ) ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే ప్రతిపాదన మేరకు ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అబే మాట్లాడుతూ.. ఒలంపిక్స్ ఏడాది పాటు వాయిదా వేయాలని తను ఐఓసీకి ప్రతిపాదన పంపానని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం జపాన్ రాజధాని టోక్యోలో జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ వాయిదా వేయాలని అనేక సభ్య దేశాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలైతే తాము ఒలంపిక్స్‌లో పాల్గొవడం లేదని కూడా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో అబే ప్రతిపాదనకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ఒకే చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలంపిక్స్ వాయిదా వేయడమే మంచిదని భావించి ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజా నిర్ణయంతో 2021లో ఒలంపిక్స్ జరిగే అవకాశం ఉంది.