ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సినీ పెద్దల అంగీకారం

అమరావతి : కాసేపటి క్రితమే మంత్రి పెర్ని నానితో సినిమా పెద్దల సమావేశం ముగిసింది. ఈ సందర్భాంగా నిర్మాత డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ… మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం జరిగిందని.. చాలా ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో సమావేశం జరగడం తొలిసారి అని పేర్కొన్నారు. విభజన తర్వాత సినిమా వాళ్లతో ఈ తరహా సమావేశం ఇప్పుడే జరిగిందని.. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని తెలిపారు.

ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు అని.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారన్నారు. టిక్కెట్ల ధరల పెంపు పై చర్చే జరగలేదని… థియేటర్ల మెయిన్టెనెన్స్ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ… ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేదన్నారు. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరామని.. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారని వెల్లడించారు. థియేటర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. .