నిన్న మొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టొమాటో రేట్ల మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగి ధర సెంచరీని దాటుతోంది. ఇటీవల ఉత్తర భారతదేశం నుంచి టొమాటో దిగుమతి కావడంతో కాస్త తగ్గినట్లు కనిపించిన టోమాటో ధరలు మళ్లీ క్రమంగా పెగరుతున్నాయి. దక్షిణాదిలో టొమాటో ధరలను పరిశీలిస్తే.. కేరళలో రిటైర్ టొమాటో ధర రూ.160కి చేరింది. ఇదే హెల్ సేల్ అయితే రూ. 120 గా ఉంది. తమిళనాడు లో కిలో టొమాటో ధర రూ. 90 గా, కర్ణాటకలో రూ .70 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటో ధర రూ.60-100 మధ్య పలుకుతోంది.
ఇటీవల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో టొమాటో సాగు పై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో టొమాటోకు కేరాఫ్ గా ఉండే .. చిత్తూర్ జిల్లాతో పాటు అనంతపురం, కడప, నెల్లూర్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు తమిళనాడు , కేరళలలో కూడా భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో టొమాటో సాగుపై, దిగుబడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతోనే టొమాటో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.