కాఫీలో ఉండే కెఫైన్ ఆరోగ్యానికి హానికరం అని ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. అయినా కూడా కాఫీ తాగడం మాత్రం మానరు. పొద్దున్న లేవగానే కాఫీ చుక్క నోట్లో పడకపోతే కిచెన్లో ఉన్న సామాన్లన్నీ గాల్ల్ ఎగరేసేవారు చాలా మంది ఉన్నారు. కాఫీకి అంతగా అలవాటు పడ్డవారు అది లేకుండా ఉండలేరు. ఐతే కాఫీ లోని కెఫైన్ ఆరోగ్యానికి హానికరం చేస్తుందని తెలుసు కానీ, ఏ విధంగా చేస్తుందన్నది చాలామందికి తెలియదు. ఈ రోజు మనం కాఫీ వల్ల వచ్చే అనర్థాలేంటో తెలుసుకుందాం.
రోజులో ఎక్కువ సార్లు కాఫీ తాగడం వల్ల బద్దకం బాగా పెరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. రెండు గ్లాసుల కంటే ఎక్కువ సార్లు తాగడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయట. రోజులో రెండు కప్పులు మాత్రమే తాగేవారికి కాఫీ చాలా మేలు చేస్తుందని తెలిసింది. గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కాఫీ బాగా సాయపడుతుందట. అదీ రోజూ రెండు కప్పులే సుమా. అతి అనర్థం అంటారు. కాఫీ కూడా అతిగా తాగితే అనర్థాలని తెచ్చిపెడుతుంది.
ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థపై దాని ప్రభావాన్ని చూపిస్తుందట. అంతే కాదు కార్టిసాన్ అనే హార్మోన్ ని పెంచి స్ట్రెస్ ని మరింత పెంచేలా చేస్తుంది. దీని కారణంగా అనేక ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. ఐతే ఈ కెఫైన్ ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది. కొంత మందికి రెండు కప్పులు తాగినా ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. విటమిన్ బీ లెవెల్స్ ని తగ్గించి దాని కారణంగా వచ్చే వ్యాధులకి కాఫీ కారణమవుతుంది.
ఇంకా శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందదు. దానివల్ల ఆడవాళ్లకి రుతుక్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఏదీ మోతాదుకి మించి తీసుకోకూడదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయం గుర్తుంచుకోవాలి.