ఎవరు ఫిట్ ?
ఎవరు ఔట్ ?
ఎవరిది డౌట్ ?
ఎవరికి కౌంట్ ?
వరుస నిరసలను ఉద్యమాలతో రాష్ట్రం వేడెక్కిపోతోంది.శీతల గాలుల నడుమ రాజకీయం అట్టుడికిపోతోంది. ఎంత చెప్పినా ఉద్యోగులు దిగివచ్చేందుకు అస్సలు ఇష్టపడడం లేదు.తమ మాటే చెల్లాలని పంతం పడుతున్నారు. వచ్చే నెల ఏడున సమ్మెకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. ఆరు అర్ధరాత్రి నుంచే ఇందుకు సంబంధించి కార్యాచరణ షురూ కానుంది. అయితే ఏపీ సర్కారు తరఫున బొత్స మాట్లాడుతున్నా, పేర్ని నాని మాట్లాడుతున్నా కూడా ఎక్కడా వినిపించుకోని విధంగానే ఉద్యోగులు ఉన్నారు. సమ్మెలోకి ఆర్టీసీ ఉద్యోగులను తీసుకువచ్చి బస్సులను నిలిపివేసి తద్వారా ఉద్యమ తీవ్రతను సీఎంకు తెలియజెప్పాలని అనుకుంటున్నా ఆ మేరకు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగానే ఉంది.ఎందుకంటే ఆర్టీసీలో వైసీపీకి అనుబంధం ఉన్న సంఘం సమ్మెకు మద్దతు ఇవ్వడం లేదు.
అదేవిధంగా తమకు సంబంధించి డిమాండ్లేవీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా లేవని కూడా తేల్చి చెబుతున్నారు. దీంతో ఆర్టీసీ సంఘాలు అన్నీ ఏకతాటిపై నడిచే వీల్లేదు అని కూడా తేలిపోయింది. ఇక సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెలోకి రారనే తెలుస్తోంది. ప్రొహిబిషన్ పీరియడ్ కన్ఫర్మేషన్ ఉంది కనుక ఇప్పుడెందుకు ఈ తలనొప్పి అని వాళ్లంతా భావిస్తున్నారు.కనుక కొంత మేరకు ఉద్యమ ప్రభావం ఉంటుంది కానీ సంబంధిత వర్గాలు ఆశించిన స్థాయిలో ఉంటుందా ఉండదా అన్నది ఇప్పటికిప్పుడు తేల్చలేం.
కొత్త పీఆర్సీకి సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి, ఉద్యోగ సంఘాలకు మధ్య యుద్ధమే నడుస్తుంది.ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలలో ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తోంది.తమకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలి ఎన్నికల హామీ ప్రకారమే ఉద్యోగుల సంక్షేమానికి జగన్ మోహన్ రెడ్డి పనిచేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.అదేవిధంగా ఫిట్మెంట్ ను 23 శాతం ఇవ్వడం తగదని కూడా చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐఆర్ విషయమై 27 శాతం చెల్లించి ఇప్పడు ఫిట్మెంట్ ను మరియు హెఆర్ ను తగ్గించడమే అన్యాయమని అంటున్నాయి.గతంలో పాటించిన విధంగా హౌస్ రెంట్ అలవెన్సుకు సంబంధించి శ్లాబును యథాతథంగా ఉంచాలని, మార్పులూ చేర్పులూ లేకుండానే అమలు చేయాలని కోరుతున్నాయి.ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలలో నిరసనలు తెలుపుతున్నాయి.
ఇక ఉద్యోగ సంఘాలు చెబుతున్నడిమాండ్లను కానీ గొంతెమ్మ కోరికలను కానీ తాను తీర్చలేనని జగన్ తేల్చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తాను ప్రకటించిన పీఆర్సీ ప్రకారం చూసుకున్నా పదివేల కోట్ల రూపాయలు అదనపు భారం అని అంటున్నారు.ఇదే సందర్భంలో ఉద్యోగులు మాత్రం తమకు పాత జీతాలే కావాలని అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు సమస్య అయితే పరిష్కారం అయ్యేలా లేదు.
కానీ ఉద్యమంలో మాత్రం సీఎం జగన్ ను ఉద్దేశించి ఉపాధ్యాయులు అనరాని మాటలన్నీ అంటున్నారు. కొందరైతే మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఓ ఆర్థిక నేరగాడ్ని ఎన్నుకుంటే ఇలానే జరుగుతుంది అని అనరాని మాటలన్నీ అంటున్నారు. ఇవన్నీ ఓ విధంగా ఉపాధ్యాయులకు ఇబ్బందులు తెచ్చి పెట్టేవే! కొందరైతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ముందున్న కాలంలో ఉపాధ్యాయులకు సమస్యలు తెచ్చి పెట్టేవే! వాస్తవానికి సీఎం జగన్ సూచన మేరకే సజ్జల మాట్లాడుతున్నారు కానీ ఎక్కడా తన వ్యక్తిగత అభిప్రాయం అయితే చెప్పడం లేదు.
ఇదే సమయంలో ఆ రోజు వైఎస్ హయాంలో కేవీపీ ఇదేవిధంగా సలహాదారు హోదాలోనే పలు సందర్భాల్లో ఇరుక్కుపోయారని, ఇప్పుడూ అదే విధంగా రామకృష్ణా రెడ్డి ఇరుక్కుపోతున్నారని ఇంకొందరు అంటున్నారు. ఏదేమయినప్పటికీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ సీఎం ను కానీ సజ్జలను కానీ నోటికి వచ్చిన విధంగా తిట్టడం, బూతు పాటలు పాడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు సరి కదా ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ మధ్య దూరం అయితే పెరిగిపోవడం ఖాయం.
– టాపిక్ అండ్ ట్రాఫిక్ – మన లోకం ప్రత్యేకం